బోనకల్లు, మే 2 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుగోలు హామీలు ఇచ్చి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును మరిచి ప్రజలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు అన్నారు. శుక్రవారం బోనకల్లు మండలాధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ చెంపపెట్టుగా మారిందన్నారు. మీటింగ్ అనంతరం కేసీఆర్ రోడ్డు మార్గాన వెళ్తుంటే పార్టీలకతీతంగా ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు తెలిపారు. సారు మీరే రావాలి.. మళ్లీ సీఎం కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జేజేలు పలికినట్లు చెప్పారు. కేసీఆర్ సీఎం పేరును ప్రస్తావించలేదని రేవంత్ రెడ్డి బాధపడుతున్నారని, ఈ సీఎం గురించి మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారని, వారు కూడా ముఖ్యమంత్రి లాగానే వ్యవహరిస్తున్నారని పోలీస్ అధికారులు మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఒక మంత్రి భూముల సెటిల్మెంట్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నారని, మరో మంత్రి కమీషన్లు తీసుకుంటూ సంపాదించుకుంటున్నారని విమర్శించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. కాంగ్రెస్ ప్రధాన మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడం జరిగిందన్నారు. రిటైర్ ఉద్యోగులు వారికి రావాల్సిన డబ్బులను ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల వేలాదిమంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.8 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించడానికి కూడా కళాశాలల నుంచి కమీషన్ అడుగుతున్నట్లు విమర్శించారు. మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారని, కానీ ఐకెపి, సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం అమ్ముకోవాలని రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ప్రజలు తేడాను తెలుసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని బెంగళూరు, ఢిల్లీలో రియల్ ఎస్టేట్ పెరిగిపోయిందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలను అమలుపర్చకపోవడంతో కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ శ్రీరామరక్షగా నిలుస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, రైతుబంధు మాజీ కన్వీనర్ వేమూరి ప్రసాద్, ఇటికాల శ్రీనివాసరావు, నాయకులు కొనకంచి నాగరాజు, పారా ప్రసాద్, మూడవత్ సైదా, ఎంగల కనకయ్య, గద్దల వెంకటేశ్వర్లు, కొమ్మినేని ఉపేంద్ర, షేక్ నజీర్, తాళ్లూరి ప్రేమానందం, మాధవరావు పాల్గొన్నారు.