సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 6: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఈ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
సత్తుపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ సత్తుపల్లి మండల కార్యకర్తల సమావేశంలో సండ్ర మాట్లాడారు. అలవిగాని హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ఆ వాగ్దానాలను మరిచిపోయిందని విమర్శించారు. రూ.4 వేల చొప్పున ఇస్తామన్న ఆసరా పింఛన్లను ఇప్పటికే రూ.2 వేల చొప్పునే ఇస్తున్నారని, రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలుచేయలేదని, కల్యాణలక్ష్మి జాడేలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసపు వాగ్ధానాలకు సంబంధించిన కరపత్రాలను స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సత్తుపల్లి మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు అనారోగ్యం పాలవడంతో ఎన్నికల నిర్ణయాలు తీసుకునే అంశంపై పార్టీ మండల అధ్యక్షుడిగా దొడ్డా శంకర్రావును నియమించినట్లు చెప్పా రు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ మోదుగు పుల్లారావు, బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి రామారావు, శ్రీనివాసరెడ్డి, కొత్తూరు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.