మధిర (చింతకాని), మార్చి 24 : ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు, వ్యవసాయ కూలీలను నట్టేట ముంచిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. సోమవారం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు నివాసంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోండి.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తుందని రేవంత్రెడ్డి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక చేసేది లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల్లో రైతులు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, ఈ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయన్నారు.
మంత్రి తుమ్మల రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పడంపై రైతాంగంలో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే హామీల సాధన కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యుడు మంకెన రమేశ్, పార్టీ మండల కార్యదర్శి బొడ్డు వెంకటరామారావు, వేముల నర్సయ్య, జావీద్, మాజీ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.