ప్రకృతి ప్రకోపం, ప్రభుత్వ అలసత్వం సామాన్య రైతులను మనో వేదనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న పాలకులు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. సరిగ్గా పంట చేతికి అందే సమయంలో అధిక వర్షాలు నిట్టనిలువునా ముంచుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పంటల బీమాను కొనసాగిస్తామని, అదికూడా 2024 వానకాలం నుంచీ అమలు చేస్తామంటూ స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కానీ నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడంలేదు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఇందుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేయాలని ఆ శాఖాధికారులను ప్రత్యేక సమావేశంలో ఆదేశించారు.. కానీ వారినుంచీ స్పందన లేదు. ఇప్పటికే రెండు పంటలకు మొండిచేయి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైనా పంటల బీమాపై మార్గదర్శకాలు ఖరారు చేయలేదు.
అశ్వారావుపేట, జూలై 24 : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను బీమాతో ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి అవుతున్నా ఇప్పటివరకు కనీసం మార్గదర్శకాలను కూడా ఖరారు చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి పంటల బీమాను 2024 సీజన్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. గడిచిన రెండు పంటలకు బీమా పథకం అమలు చేయలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏప్రిల్ నెలలో వ్యవసాయ శాఖాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంటల బీమాపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. బీమా కంపెనీలను సమన్వయం చేసుకుంటూ అమలు చేసే బ్యాంకర్లు కూడా ఆసక్తి చూపటం లేదు. ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజనలో చేరాలని వ్యవసాయాధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నప్పటికీ ఆ దశగా కూడా తదుపరి చర్యలు కనిపించటం లేదు. అధికారుల నిర్లక్ష్యం, సర్కారు ఉదాసీనత, ప్రకృతి కరుణించకపోవటంతో ఏటా రైతులు అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు చేతికి అందే సమయానికే అధిక వర్షాలు పడి పండిన పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. పడిన శ్రమతోపాటు పెట్టిన పెట్టుబడి ఆవిరైపోవటంతో శారీరకంగా, ఆర్థికంగా నలిగిపోతున్నారు. అధికారులు మాత్రం క్రాప్ బుకింగ్ తర్వాతనే ఉండొచ్చని సూచనప్రాయంగా చెబుతున్నారు. అయినా నమ్మకం కనిపించటం లేదు.
బీమా ఇలా…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫజల్ బీమా పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయాధికారులు గతంలో జిల్లాను 67 క్లస్టర్లుగా పథకం అమలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 5.91 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో 2.05 లక్షల ఎకరాలో పత్తి, 1.63 లక్షల ఎకరాల్లో వరి, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15 వేల ఎకరాల్లో మిర్చి, 5 వేల ఎకరాల్లో వేరు శనగ, 75 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం, 43 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి.
ఫజల్ బీమా పథకం ప్రకారం వానకాలానికి ప్రీమియం మొత్తంలో రైతు వాటా కింద 2శాతం, యాసంగిలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5శాతం చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50శాతం చెల్లిస్తాయి. పంటలు వేసిన తర్వాత వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియ చేపడతారు. దీని ప్రకారం ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఎంత పంట సాగు చేస్తున్నారనే లెక్కలను రూపొందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే పంటల బీమా పథకం అమల్లోకి వస్తుంది. గత ఏడాది జిల్లావ్యాప్తంగా అధిక వర్షాలతో పంటలకు కొంతనష్టం వాటిల్లినప్పటికీ పరిహారం అందలేదు. గోదావరి దాటికి కొట్టుకుపోయిన పంటలకు ప్రభుత్వమే పరిహారం అందించింది.
‘పంటల బీమా’ అమలు చేయాలి
అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు పడే కష్టం కంటే చేతికందిన పంటలు నాశనం కావటంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటున్నారు. ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పంటల బీమా పథకం కొనసాగించాలి. లేదా ప్రభుత్వమైనా పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
– సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, రైతు, అశ్వారావుపేట
ఇంకా మార్గదర్శకాలు అందలేదు
పంటల బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. కానీ ఇప్పటివరకు ఎటువంటి మార్గదర్శకాలు అందలేదు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఫజల్ బీమా పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యల మేరకు బీమా పథకం కార్యరూపం దాల్చుతుంది.
– రవికుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు, అశ్వారావుపేట