ఈ ఏడాది దసరా పండుగ రోజు సింగరేణి కార్మికులకు ఆనందంగా లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. లాభాలు ఎక్కువగా వచ్చినప్పటికీ దసరా బోనస్ తక్కువ ప్రకటించి నిరాశను మిగిల్చింది. గతంలో కంటే ఎక్కువ వస్తుందనుకున్న కార్మికుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం భద్రాద్రి జిల్లాలోని సింగరేణి అన్ని ఏరియాల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. గుర్తింపు కార్మిక సంఘం సైతం యాజమాన్య వైఖరిని తప్పుపట్టింది.
తక్కువ బోనస్ ప్రకటించడం సిగ్గుచేటని నాయకులు విమర్శించారు. 2023లో 32 శాతం లాభాలు ప్రకటిస్తే ఈ ఏడాది కేవలం 12 శాతమే వాటా ప్రకటించడంపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. ఈ ఏడాది రూ.6,394 కోట్ల లాభాలు రాగా కేవలం రూ.819 కోట్లు మాత్రమే వాటా చూపించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ సర్కారు సింగరేణి కార్మికులపై కూడా వివక్ష చూపింది. ఏటా దసరాకు సింగరేణి కార్మికుల ఇచ్చే లాభాల వాటా బోనస్‌కు కోత పెట్టింది. దీంతో కోల్‌బెల్ట్ అంతటా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు నిరసన తెలిపారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోపాటు ఐఎఫ్టీయూ, గుర్తింపు సంఘం నాయకులు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భద్రాద్రి జిల్లాలో వివిధ ఏరియాల్లో సింగరేణి కార్మికులు జీఎం కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి విధులకు హాజరయ్యారు.
సింగరేణి కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో కొందరు నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు మేలు జరిగేలా లాభాల వాటా ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చి కార్మికులను మోసం చేసిందని అన్నారు. దీనికోసం రాజధానిలో ఎన్నో హంగులతో సింగరేణి యాజమాన్యం భారీ ఖర్చుతో లాభాల వాటా ప్రకటన చేయడానికి పెద్ద సభ పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్మికుల కష్టార్జితాన్ని వేరే పెట్టుబడులకు వినియోగించడం బాధాకరమని అంటున్నారు.
బోనస్‌లో కోతలు దారుణం
బొగ్గు కార్మికులకు వచ్చే లాభాల వాటాలో కోతలు విధించడం దారుణం. దసరా పండుగకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు చేదు కబురు చెప్పి తీపి కబురు అని ప్రకటన చేసుకున్నది. కార్మికుల ఉసురు తప్పక తగులుతుంది. నమ్మి ఓటేసినందుకు నమ్మక ద్రోహం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. ఆచరణలో మాత్రం అమలులేదు. బోనస్ తగ్గించి కార్మికులకు పొగ గొట్టారు.
-కాపు కృష్ణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం
కాంగ్రెస్ వచ్చింది.. అన్యాయం చేసింది..
సమైక్య పాలనలో నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్లీ కాంగ్రెస్ వచ్చి లాభాలను కార్మికులకు దక్కకుండా చేసింది. కార్మికుల చెమట చుక్కల కష్టాన్ని వేరే అభివృద్ధి పనులకు కేటాయించడం దారుణం. నిజాలు బయటకు వచ్చేదాకా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కార్మికులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం.
-నాగెల్లి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నేత, మణుగూరు ఏరియా