మధిర, ఏప్రిల్ 3: అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర మండల కార్యదర్శులు మురళి, మందా సైదులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎం పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రజలకు హామీలిచ్చి ఇప్పుడు వాటిని ఎగనామం పెడుతుందని దుయ్యబట్టారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వాటిని రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పింఛన్లు పెంచాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు మంజూరు చేయాలన్నారు. ప్రతి మహిళకు రూ.2500, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేయాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల నాయకులు పాల్గొన్నారు.