వేంసూరు, జూన్ 25 : ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈవో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు సమయానికి మధ్యాహ్న భోజనం వండి పెండుతున్న కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అనంతరం ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు షేక్ లాల్మహమ్మద్, ఎస్కే రంజాన్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకులు బింగి నాగ వెంకటేశ్వరరావు, పిల్లి బుచ్చాలు, లోక వెంకటేశ్వరరావు, సామ్రాజ్యం, హమీద్, సాదు సూరమ్మ, సీతామహాలక్ష్మి, రవీంద్ర, అబ్బులమ్మ, సక్కుబాయి, శేషమ్మ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.