– సంక్లిష్టంగా ఏదులాపురం మున్సిపల్ నిర్వహణ
ఖమ్మం రూరల్, జూలై 21 : సాధారణంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఓ వార్డు ఆఫీసర్ అందుబాటులో ఉంటేనే ప్రజలకు అంతంత మాత్రం సేవలు అందుతాయి. అలాంటిది 32 వార్డులకు ఐదుగురు వార్డు ఆఫీసర్లు సేవలందిస్తున్నారంటే ఆ మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ల సేవలు ఎంతమేర ప్రజలకు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు భౌగోళికంగా, ఇటు జనాభా పరంగా అతిపెద్ద మున్సిపాలిటీగా ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. గత సంవత్సరం జనవరి నెలలో సుమారు 13 పంచాయతీలతో మున్సిపాలిటీగా అవతరించింది. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి ప్రతి వార్డుకు ఓ కౌన్సిలర్ సైతం అందుబాటులోకి రావడం జరిగింది. 32 వార్డులకు గాను 32 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ వార్డు ఆఫీసర్లు మాత్రం సగానికి సగం కూడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ ఉంటే తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు ఆయన పర్యవేక్షణ ఉంటుంది.
పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు, భువన్ యాప్ నిర్వహణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ వంటి అనేక కార్యక్రమాలను వార్డు ఆఫీసర్ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు నిత్యం వార్డులో జరిగే వాటి నిర్వహణకు సంబంధించిన డ్రాప్టింగ్ నివేదిక రూపంలో ఉన్నత అధికారులకు సైతం అందజేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపల్ వార్డులో వార్డు ఆఫీసర్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. మున్సిపల్ అభివృద్ధి ప్రజల సంక్షేమంలో కీలకమైన వార్డు ఆఫీసర్ల పాత్ర ఏదులాపురం మున్సిపాలిటీలో నామమాత్రం కావడంతో స్థానికులకు ఆశించిన సేవలు అందడం లేదు. తద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో జాప్యం ఏర్పడుతుందని ఆరోపణలు తీవ్రంగా వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.