పాల్వంచ, ఆగస్టు 5: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వెలుగులు విరజిమ్మిన కేటీపీఎస్ పాత ప్లాంట్ ఓఅండ్‌ఎంలో ఎనిమిది యూనిట్లకు చెందిన 8 కూలింగ్ టవర్ల కూల్చివేత సోమవారం విజయవంతమైంది. భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ పాత కర్మాగారాన్ని తొలగించేందుకు రూ.450 కోట్లతో ముంబైకి చెందిన హెచ్ఆర్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ‘ఏ’ స్టేషన్లో 102 మీటర్ల ఎత్తున్న నాలుగు కూలింగ్ టవర్లను ఉదయం 8:08 గంటలకు ఎక్స్‌ప్లోజివ్స్‌తో కూల్చివేశారు. ‘బీ’ స్టేషన్లో 115 మీటర్ల ఎత్తున్న రెండు కూలింగ్ టవర్లను 10:10 గంటలకు ‘సీ’ స్టేషన్లోనూ అంతే ఎత్తున ఉన్న మరో రెండు కూలింగ్ టవర్లను 11.40 గంటలకు నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత కంపెనీ ప్రతినిధులు, జెన్కో అధికారులు పర్యవేక్షించారు. అయితే ఎన్నో ఏళ్లనాటి ఈ కూలింగ్ టవర్ల కూల్చివేతను పాల్వంచ పట్టణ వాసులు దూరం నుంచి ఆసక్తిగా వీక్షించారు. ఆ పరిసరాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నిషేధం విధించారు. టవర్ల కూల్చివేత ప్రక్రియ క్షణాల్లో విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. టవర్ల కూల్చివేత సమయంలో కేటీపీఎస్ 5వ దశ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు వెళ్లే లైన్లలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి వేరే మార్గం ద్వారా సరఫరా చేశారు.
కేటీపీఎస్ పాత కర్మాగారంలోని ‘ఏ’ స్టేషన్ నిర్మాణానికి 1965-67లో పునాదులు పడ్డాయి. మొదటగా 60 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్లను పూర్తి చేశారు. అనంతరం 1970 తర్వాత ‘బీ’ స్టేషన్లో 120 మెగావాట్లతో రెండు యూనిట్లను, ‘సీ’ స్టేషన్లో 120 మెగావాట్ల చొప్పున మరో రెండు యూనిట్లను నిర్మించారు. 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 2,500 మంది కార్మికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాత ప్లాంట్‌లో విధులు నిర్వహించేవారు. 1965లో పాల్వంచ జనాభా 15 వేలకు మించి లేరు. అయితే ఈ కర్మాగారం నిర్మాణంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేకమంది వలస వచ్చారు. దీంతో దాదాపు 1.20 లక్షల జనాభాతో ప్రస్తుతం పట్టణం మున్సిపాలిటీగా అవతరించింది.
కేటీపీఎస్ పాత కర్మాగారంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ. యూనిట్లు సక్రమంగా నడుస్తున్నప్పటికీ దీని నుంచి వెలువడే బూడిద ప్రజలకు హానికరంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఈ యూనిట్లను తొలగించాలని ఆదేశించారు. స్థానికులు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో పాత ప్లాంట్ తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీపీఎస్‌లో ఏడో దశ నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక నిబంధనలు విధించింది. ఈ ఎనిమిది యూనిట్లను తొలగిస్తేనే కొత్త కర్మాగారానికి అనుమతిస్తామని చెప్పడంతో 2020 ఏప్రిల్‌లో పాత ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. టెండర్లు నిర్వహించి హెచ్ఆర్ సంస్థకు కూల్చివేత పనులను అప్పగించారు. తాజాగా కూలింగ్ టవర్ల కూల్చివేతతో సోమవారం నుంచి కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం ప్రస్తానం ముగిసినట్లయింది.