కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 3: ఉద్యోగులు నిజాయితీగా, నిబద్ధతగా, నిష్పక్షపాతంగా పనిచేస్తే వారు పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా అవినీత రహిత భారతదేశం సాధ్యమవుతుంది. ఇదే స్ఫూర్తితో ‘అవినీతి రహిత దేశం – అభివృద్ది చెందిన దేశం’ అనే నినాదంతో సింగరేణి వ్యాప్తగా గత నెల 31 నుంచి ఈ నెల 6 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుగుతున్నాయి.
1987లో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో నాటి నుంచి ఆ విభాగం అందుబాటులోకి వచ్చింది. విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఈ విభాగంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌తో పాటు ఒక బ్రిగేడియర్, లెఫ్టినెంట్ కల్నల్ మేజర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (లెప్టినెంట్, కల్నల్) సభ్యులుగా ఉండేవారు. సంస్థలో పనిచేస్తున్న ఏ ఉద్యోగి, ఏ అధికారి అయినా అక్రమాలు, అవినీతికి పాల్పడితే తక్షణ చర్యలు తీసుకునేవారు. అక్రమాలకు పాల్పడిన ఎందరో అధికారులను సస్పెండ్ చేసిన ఘటనలు ఉన్నాయి.
వారోత్సవాల్లో అవగాహన..
వారోత్సవాల్లో భాగంగా సింగరేణి ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాల నివారణపై సింగరేణీయులకు అవగాహన కల్పిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సంస్థను అభివృద్ధి బాటలో పయనింపజేయాలని ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఏ విభాగంలోనైనా అవకతవకలు జరగుతున్నట్లు తెలిసినా, అవినీతి జరుగుతున్నదని తెలిసినా విజిలెన్స్ విభాగానికి తెలియజేయాలంటున్నారు. విజిలెన్స్ విభాగానికి ఏ విభాగాన్నైనా తనిఖీ చేసే అధికారం ఉంటుందని, ఏ స్థాయి ఉద్యోగినైనా విచారించే అధికారం ఉంటుందని అప్రమత్తం చేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయంతో వ్యవస్థాగత లోటుపాట్లు, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ఈ విభాగంలో నివారణ (ప్రివెన్సివ్), శిక్షణాత్మక (పునిటివ్), భాగస్వామ్యం (పార్టిసిపేటివ్) అనే పద్ధతులను అవలంబిస్తుందంటున్నారు.
అమలు ఇలా..
అవినీతి, అక్రమాల నివారణ చర్యల్లో విజిలెన్స్ విభాగం సంస్థ ఉద్యోగులు, కార్మికులందరినీ భాగస్వాములను చేస్తున్నది. ప్రతి గని, డిపార్ట్మెంట్లో అవినీతి నివారణపై నినాదాల బోర్డులు పెట్టిస్తున్నది. అవినీతికి పాల్పడే వ్యక్తుల పేర్లు చెప్పే సింగరేణీయుల వివరాలను గోప్యంగా ఉంచి, అక్రమార్కులను విచారిస్తుంది. వారోత్సవాల సందర్భంగా సింగరేణీయులు, సంస్థ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ‘అవినీతి రహిత దేశం – అభివృద్ధి చెందిన దేశం’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నది. ఇప్పటికే వారోత్సవాలపై సింగరేణివ్యాప్తంగా వాల్‌పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం జరుగనున్నది. సంస్థ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా డైరెక్టర్ (ఫైనాన్స్) బలరాం వ్యవహరిస్తున్నారు.