రఘునాథపాలెం, ఏప్రిల్ 9: ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరనున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా అభివృద్ధి పనులకు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం బోధించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచన చేసి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో ‘మన ఊరు – మన బడి’ పనుల ప్రారంభానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 12 రకాల మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోటరీనగర్‌లోని పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. పాఠశాలల్లో ప్రధానంగా 12 రకాల మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రూ.7,280 కోట్లను మూడు దఫాలుగా వెచ్చించి 26 వేల పైచిలుకు పాఠశాలలను అభివృద్ధి చేసే గొప్ప కార్యక్రమం అని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, గ్రామస్తులు, నగర వాసులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ ఏడాది నుంచి ‘ఇంగ్లిష్ మీడియం’..
ఈ ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకు గాను కొత్తగా మరికొంత మంది టీచర్లు రాబోతున్నారని, ఉన్న టీచర్లకు శిక్షణ అందిస్తామని అన్నారు. అర్థమయ్యే విధంగా కొత్త పుస్తకాలు ముద్రిస్తామని, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ‘మన బడి’తో నూతన శకం మొదలైందన్నారు. కేజీ టూ పీజీ విద్యా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీఈవో యాదయ్య, జడ్పీటీసీ ప్రియాంక, కార్పొరేటర్లు జాన్‌బీ, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, హెచ్ఎంలు మోత్కూరి మధు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరూనాయక్, రాంక్యాతండా ఎంపీటీసీ పాల్గొన్నారు.