దమ్మపేట/ అశ్వారావుపేట రూరల్/ పాల్వంచ రూరల్/ రఘునాథపాలెం, డిసెంబర్ 6: తుఫాన్ ప్రభావంతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో దెబ్బతిన్న పంటలను భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక బుధవారం పరిశీలించారు. తొలుత ఆర్డీవో శిరీష, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దమ్మపేటకు వచ్చిన ఆమె.. సుధాపల్లిలో దెబ్బతిన్న వేరుశెనగ పంటను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటల వివరాలను తక్షణమే తనకు అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పేరంటాలచెరువు, మరిగొమ్ము కాలువ తెగిపోవడంతో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి కాలువకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. దమ్మపేటలోని కల్యాణమండపం వీధిలో నీటమునిగిన ఇళ్ల వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడారు.
ఉట్లపల్లిలో దెబ్బతిన గృహాల పరిశీలన..
అశ్వారావుపేట రూరల్ మండలంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న గృహాలను కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. ధ్వంసమైన సోయం చిన్న వెంకటేశ్, పద్దం మునెమ్మ, తామ చిలకమ్మ గృహాల వద్దకు వెళ్లి పరిశీలించారు. నష్టం అంచ నా వేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి శ్యాంకుమార్ పాల్గొన్నారు. కాగా, అదే గ్రామ ంలో మరికొన్ని ఇళ్లు కూడా వర్షాలకు దెబ్బతినగా కలెక్టర్ ఆ ఇళ్లను పరిశీలించకుండానే వెనుదిరిగారు. దీంతో ఆ గ్రా మ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రఘునాథపాలెంలో..
తుఫాన్ వల్ల రఘునాథపాలెం మండలంలో 1737 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న, 750 ఎకరాల్లో మిరప పంటలు దెబ్బతిన్నట్లు ఏవో ఇంటూరి భాస్కర్‌రావు తెలిపారు. ఈ మేరకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో ఏడీఏ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం పరిశీలించారు.
‘కిన్నెరసాని’ నుంచి నీటి విడుదల
తుఫాన్ కారణంగా పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్‌లోకి బుధవారం భారీగా వరద చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ఉదయం ప్రవాహం 404.8 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 8 వేల అడుగులుంది. అప్రమత్తమైన అధికారులు అదే ఇన్‌ఫ్లోను రెంటు గేట్లు తెరిచి దిగువకు వదిలారు. వరద కారణంగా దిగువన రాజాపురం చప్టా నీట మునిగి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపువాసులకు ముందస్తుగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేశారు.