మామిళ్లగూడెం, మార్చి 7: ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా అంశాలపై జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఖమ్మం డీపీఆర్సీ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాలుగు నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, 5 పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, ఒక పోలింగ్ కేంద్రం ప్రదేశం మార్పు వంటి అంశాలకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పట్టభద్రుల ఓటర్ల జాబితాలో నమోదు కోసం ఈ నెల 14 వరకూ అవకాశం ఉందని అన్నారు. ఫిబ్రవరి 24న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల14 లోపు వాటిని తెలియజేయాలని సూచించారు. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.