సత్తుపల్లి, జనవరి 3: సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సత్తుపల్లి పట్టణంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 407 గ్రామపంచాయతీలు, పట్టణాల పరిధిలోని 60 వార్డుల్లో ప్రజాపాలన సభలు నిర్వహించామన్నారు.
ప్రజల నుంచి 1.99 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రజలు దరఖాస్తు ఫారంతోపాటు ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌లు జత చేస్తే సరిపోతుందన్నారు. ఇక ఏ విధమైన ఇతర ధ్రువపత్రాలు అవసరం లేదన్నారు. దరఖాస్తుదారులు దరఖాస్తు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, ఫిషరీస్ ఏడీ ఆంజనేయస్వామి, డీఆర్డీవో విద్యాచందన, ఆర్డీవో అశోక్‌చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ సుజాత ఉన్నారు.