ఖమ్మం, జనవరి 18: ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వానివిగా రికార్డుల్లో ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. నగరంలోని ఖానాపురం ట్యాంక్‌బండ్ వద్ద సర్వే నెంబర్ 94లో 4.08 ఎకరాల స్థలాన్ని జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయ భవనం, రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు నిమిత్తం 2009లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ స్థలంలో ఉద్యానవన శాఖ అధికారులు నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా ఉంచారు.
ఈ స్థలాన్ని బీ.వీరారెడ్డి, రాంరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించి షెడ్లు నిర్మించారు. తాజాగా అధికారులు గుర్తించి ఆ షెడ్లను తొలగించి ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీ నం చేసుకున్నారు. సుమారు రూ.12కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని రక్షించేందుకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల ద్వారా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ స్థలం రక్షణ కోసం ఫెన్సింగ్, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇకముందు అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా, ఆక్రమణలు జరుగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎక్కడైనా ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.