కొత్తగూడెం టౌన్, డిసెంబర్ 15 : దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో జిల్లా సంక్షేమాధికారి విజేత అధ్యక్షతన నిర్వహించిన దివ్యాంగుల ఆటల పోటీలను అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆటల్లో రాణించడం వల్ల దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చన్నారు. పారా ఒలింపిక్స్లో మన దేశానికి అనేక బహుమతులు వచ్చాయని, ప్రతిరోజూ క్రీడలు సాధన చేయడం వల్ల మంచి నైపుణ్యం, మెళకువలు తెలుస్తాయన్నారు.
దివ్యాంగులకు మానసిక, శారీరక ఉల్లాసం కలిగేందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పోటీ ప్రపంచంలో దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎవరూ ఏ విషయంలోనూ అధైర్యపడొద్దని అన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీవీపీఎస్ అధ్యక్షుడు సతీశ్, జగ్గుదాస్, బాలకృష్ణ, నరేందర్, ఎన్జీవో నిర్వాహకులు ప్రసాద్, క్రిషోలిక్, జ్యోతి, గౌతమి, వరప్రసాద్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.