ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 18 : భవిష్యత్లో వచ్చే అకాల వరదలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(సాప్)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. మండలంలోని మున్నేరు ప్రభావిత ప్రాంతమైన కరుణగిరిలో బుధవారం పర్యటించిన కలెక్టర్.. సెయింట్ జోసెఫ్ మేజర్ చర్చి హాల్లో క్రిస్టియన్ సంబంధిత యాజమాన్యం, అధికారులతో ఇటీవల వచ్చిన వరదలు, కలిగిన నష్టం, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
కరుణామయ అనాథాశ్రమం, అంధులు, మూగ పిల్లల జ్యోతి నివాస్ స్కూల్ వరకు వచ్చిన వరదలు, కలిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గంటల వ్యవధిలో కుంభవృష్టితో వర్షం కురవడంతో పరీవాహక ప్రాంతాల్లోని చెరువులు, ప్రాజెక్టులు అప్పటికే నిండుకుండలుగా మారాయని, ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో మున్నేటిలో 40 అడుగుల మేర నీటి ప్రవాహం పెరిగిందన్నారు. నగరంలో వచ్చిన భారీ వరదలతో అందుబాటులో ఉన్న అధికారుల బృందాలు, సిబ్బందితో ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అప్పటికప్పుడు చర్యలు చేపట్టారన్నారు.
వరద వచ్చే సమయంలో ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు కరుణగిరిలో సైరన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. విపత్కర సమయంలో వినియోగించుకునేందుకు శాశ్వతంగా 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, తహసీల్దార్ రాంప్రసాద్, చర్చి రెకార్డు జయరాజు, సుధాకర్, సురేశ్, విజయ్, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.