ఖమ్మం, సెప్టెంబర్ 9 : ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సర్టిఫికెట్ల జారీకి చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో సామగ్రితోపాటు సర్టిఫికెట్లు, పత్రాలు పోగొట్టుకున్న ముంపు ప్రాంతాల వారికి సర్టిఫికెట్ల, పత్రాల జారీకి పకడ్బందీ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ ప్రక్రియ నిమిత్తం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధి మినహాయించి, సత్తుపల్లి, వైరా, మధిర పట్టణ ప్రాంతాల్లో 72 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. బృందాలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి దరఖాస్తులు స్వీకరిస్తాయన్నారు. ఇంటి యజమాని నుంచి దరఖాస్తుల స్వీకరణలో భాగంగా తమకు, తమ పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్ల వివరాలు దరఖాస్తులో పొందుపర్చాలని కోరారు. ఆ వివరాల ఆధారంగా సంబంధిత శాఖల అధికారులతో సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ 10రోజులపాటు చేపడతామన్నారు.
సర్టిఫికెట్ల జారీకి మీ సేవ, ధరణి, ఇతరత్రా రుసుము, లామినేషన్ ఖర్చు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఉచితంగా సర్టిఫికెట్లు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. విదేశాల్లో అడ్మిషన్లు, ఉపాధి తదితర అత్యవసర అవసరాల ఉన్నవారు తమ హాట్ లైన్ నెంబర్ తెలియజేస్తూ, టోల్ ఫ్రీ నెంబర్ 1077కి సంప్రదించాలని, 9063211298 నెంబర్కి వాట్సాప్ ద్వారా అత్యవసరానికి సంబంధించి రుజువులు సమర్పించాలన్నారు. ఇట్టి వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు వారంలో అందజేసేలా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్, డీఈవో, డీఐఈవో పాల్గొన్నారు.