మామిళ్లగూడెం, జూలై 31 : రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేందుకు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ధరణి, ప్రజావాణి, ధ్రువీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని డీటీ, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ అన్ని క్యాటగిరీలకు చట్టాలపై అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలన్నారు.
ధరణి దరఖాస్తులు సమర్పించే సమయంలో మాడ్యూల్ ప్రకారం సంబంధిత డాక్యుమెంట్లు జత చేయాలన్నారు. ప్రతి దరఖాస్తు సమర్పించిన నెలలోనే పరిషారం అయ్యేలా చూడాలన్నారు. ప్రతి తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ధరణి సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, దరఖాస్తు చేసే ముందు దరఖాస్తుదారునికి పూర్తి అవగాహన కలిగేలా గైడ్ చేయాలని సూచించారు. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు ఇందులో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. స్వీకరించిన అర్జీలపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు.
ఎస్టీ, ఎస్సీ, మానవ హకుల, గ్రీన్ ట్రిబ్యునల్ తదితర కమిషన్లకు నివేదికలు సమయంలోగా సమర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్ లేకుండా వెనువెంటనే పూర్తి చేయాలన్నారు. చెరువుల భూముల విషయమై ఇరిగేషన్, రెవెన్యూ, గూగుల్ మ్యాపులు సరిచూసుకొని ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, డీఆర్వో ఎం.రాజేశ్వరి, ఆర్డీవోలు జి.గణేశ్, ఎల్.రాజేందర్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.