ఖమ్మం, ఆగస్టు 31 : భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సహాయం కోసం ప్రజలు ఫోన్ నెంబర్ 9063211298, టోల్ ఫ్రీ నెంబర్ 1077కు కాల్ చేయవచ్చని తెలిపారు. చెరువులు, వాగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, మత్తడి ప్రాంతాలను గుర్తించి 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. కల్వర్టులు, రోడ్లపై నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని, ప్రజలు దాటకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నీటి ప్రవాహం వద్ద వలంటీర్లను ఉంచాలని, అవసరం ఉన్న ప్రతిచోట బారికేడ్లు పెట్టాలన్నారు.
ఎలాంటి ప్రాణ, ఆస్తి, జంతు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శిథిల భవనాల ప్రాంతాల్లో జాగ్రత్తలు చేపట్టాలన్నారు. దామిని యాప్ గురించి అవగాహన కల్పించడంతోపాటు పిడుగుల నుంచి రక్షణ పొందేలా చైతన్యం తేవాలన్నారు. సమీక్షలో నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, జడ్పీ సీఈవో దీక్ష రైనా, డీఆర్వో ఎం.రాజేశ్వరి, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.