ఖమ్మం, సెప్టెంబర్ 6: ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నగర పాలక సంస్థ పరిధిలో 60, మిగతా ప్రాంతాల్లో 805 బృందాలను ఏర్పాటు చేసి.. 40,315 ఇళ్లను సందర్శించారని, 38,848 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు.
725 జ్వరం కేసులు, 62 డయేరియా, ఒక సీరియస్ కేసును గుర్తించామని, 9,590 మందికి మందులు ఇచ్చి.. ఇద్దరిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 18, మిగతా చోట్ల 2 సహాయ పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు, మందులు అందించామన్నారు. 5 ప్రత్యేక మొబైల్ టీముల ద్వారా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సత్వర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు.