ఖమ్మం సిటీ, నవంబర్ 29 : వయో వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ల ప్రత్యేక వార్డును ప్రారంభించిన ఆయన రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వయో వృద్ధులకు అవసరమైన సేవలు, వసతులు తదితర అంశాల గురించి తెలుసుకుని వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. రోగులతో మమేకమైన కలెక్టర్.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? ఇంకా ఏం కావాలి? అంటూ ఆరా తీశారు.
మెడిసిన్ విభాగానికి వెళ్లి బోర్డుపై రాసిన మందులు ఉన్నాయా? లేవా? అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖాన్ మాట్లాడుతూ వయో వృద్ధులకు సంపూర్ణ వైద్య సేవలు అందించడంతోపాటు వారి కోసం సహాయకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతీ శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీనియర్ సిటిజన్స్ వైద్య సేవల విభాగంలో ప్రత్యేక ఓపీ ఉంటుందని, వృద్ధులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించాల్సిన ఖాళీల వివరాలను అందించాలన్నారు. ఫార్మసీ ఇంటర్న్‌షిప్ కింద విధులు నిర్వహించే విద్యార్థులకు సైతం బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టాలని, ఆలస్యంగా వచ్చిన వారిపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఇందిర, ఫార్మసిస్ట్ గ్రేడ్-2 డిస్పెన్సరీ సోమ్లానాయక్, సూపర్వైజర్ పద్మావతి, డాక్టర్ సతీశ్, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.