ఖమ్మం, నవంబర్ 14 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలకు హాజరుకావాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 17వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5:30 వరకు రెండు సెషన్లు, నవంబర్ 18వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయని, ఖమ్మంజిల్లాలో మొత్తం 27,984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరికోసం 87 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్లో 8:30 నుంచి, మధ్యాహ్నం సెషన్లో 1:30 నుంచి అనుమతిస్తారని, పరీక్షాకేంద్రాల గేట్లు ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు మూసివేస్తామని, తర్వాత ఎవ్వరినీ అనుమతించరని, అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తమ వెంట బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫొటోతో కూడిన హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డు తీసుకురావాలని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగ్గా లేకపోతే అభ్యర్థి 3 పాస్ ఫొటోలు గెజిటెడ్ అధికారి లేదా చివర చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతకంతో తీసుకొచ్చి పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్‌కు అప్పగించాలన్నారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒకరోజు ముందుగా వెళ్లి చూసుకోవాలని సూచించారు. క్యాలిక్యులేటర్, పేజర్, సెల్‌ఫోన్, ట్యాబ్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజెస్, వాచ్, మ్యాథమెటికల్ టేబుల్, లాగ్‌టేబుల్, హ్యాండ్‌బ్యాగ్స్, జోలాస్, పౌచెస్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్, జ్యువెలరీ (మంగళసూత్రం, గాజులు సంబంధ ఐటెంలు మినహాయించి), ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలగు సామగ్రి తీసుకురావడానికి వీల్లేదని, చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని పేర్కొన్నారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ వ్యాలీడ్ కాదని, బయోమెట్రిక్ విధానం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, టాటూ వంటివి పెట్టుకోవద్దని తెలిపారు. ప్రతి పేపర్ సమయంలో అభ్యర్థి ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌పై సంతకం పెట్టాలన్నారు. మోడల్ ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సరిగ్గా బబుల్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలని, ఓఎంఆర్ షీట్‌ను సరిగా చెక్ చేసుకోవాలని, పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ విడిచి వెళ్లడానికి వీలులేదని ప్రకటనలో పేర్కొన్నారు.