ఖమ్మం, మార్చి 20 : జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లకు 344 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 2024-25 రబీ ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో జిల్లాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీకి సంబంధించి లక్షా 85 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం, 73 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం.. మొత్తం 2 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉండాలని, కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఏప్రిల్ రెండో వారం నుంచి వరి కోతలు ప్రారంభమవుతాయని, కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చే షెడ్యూల్ పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో అవసరమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పొరుగు రాష్ర్టాల నుంచి సన్న రకం వడ్లు రాకుండా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్, తేమ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేయింగ్, తేమ యంత్రాల పనితీరును చెక్ చేసి సర్టిఫై చేయాలన్నారు. అవసరమైన గన్ని సంచులు, అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు వీలుగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాల వద్ద అవసరమైన మేరకు హమాలీలు ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ జి.శ్రీలత, జిల్లా మారెటింగ్ అధికారి ఎంఏ.అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.