మామిళ్లగూడెం, మార్చి 28 : సీనియర్ ఉద్యోగులు వారి అనుభవాలను యువ ఉద్యోగులకు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పాల్గొన్నారు. మార్చి నెలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో కొణిజర్ల ఎంపీహెచ్ఎస్ ఫార్మసిస్టు మల్లికార్జునరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీఎంయూ కార్యాలయంలో డిప్యూటీ ఐఓఎస్గా పనిచేస్తున్న డి.బాలాజి, ఈఈ ఆర్ఎండ్బీగా పని చేస్తున్న బాల హేమలత, తిరుమలాయపాలెం తహసీల్దార్‌గా పనిచేస్తున్న రామకృష్ణ, డీఆర్డీఏలో ఈవోగా పని చేస్తున్న సత్యవతి, ఎస్సీ బాలిక హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్న రాధ ఉద్యోగ విరమణ పొందనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి ఉంటుందని, ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రతి ఉద్యోగి యువ ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, ఏవో అరుణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మం అర్బన్, మార్చి 28 : విద్యాభివృద్ధితోపాటు వ్యక్తిత్వ నిర్మాణంలో అధ్యాపకుల పాత్ర కీలకమైనదని, నవ సమాజ నిర్మాణంలో భాగంగా విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అధ్యాపకులు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. టీజీపీఎస్సీ ద్వారా జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఎంపికైన 58మంది అధ్యాపకులు శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, డీఐఈవో రవిబాబు, సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, మార్చి 28: జిల్లాలో నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత రాజీవ్ యువ వికా సం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు తమ దరరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువత తమ దరఖాస్తులను www.tgobmmsnew. cgtg. gov.in ద్వారా దరఖాస్తు చేయాలని తెలిపారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తుల ప్రింట్ కాఫీలకు సర్టిఫికెట్లు జత చేసి ఆయా శాఖల జిల్లా కార్యాలయంలో అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
కూసుమంచి, మార్చి 28: విద్యతోనే మనకు అస్థి త్వ్యం లభిస్తుందని, విద్య లేకపోతే మన అస్థిత్వం కోల్పోతామని, ప్రతి చిన్న అంశంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పాలేరు జవహార్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవం లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మనం బాగా చదువుకుంటే భవిష్యత్‌లో అమ్మానాన్నలను బాగా చూసుకోవచ్చన్నారు.
తల్లితండ్రులకు వివిధ కారణాల వల్ల చదువుకునే అవకాశం లభించలేదని, ప్రస్తుతం నవోదయ పాఠశాలలో చదువుకునే అవకాశం వచ్చిందని, దీనీని పూర్తి స్థాయంలో సద్వనియోగం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు ఒక గంట సమయం పుస్తకాలు చదివేందుకు కెటాయించాలని కలెక్టర్ సూచించారు. ఫోన్లతో గడిపే సమయాన్ని పూర్తిగా తగ్గించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎల్ శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపల్ వెంకటరమణ, పేరెంట్ కమిటీ సభ్యులు రవీందర్‌రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.