మామిళ్లగూడెం, మార్చి 28: ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు ఆశించిన రీతిలో పని చేయడం లేదన్నారు.
రైతులకు సరైన సమయంలో తక్కువ వడ్డీతో పెట్టుబడి అందించడం, రైతుల నుంచి డిపాజిట్ సేకరణ జరగాలన్నారు. ప్యాక్స్‌లో ఉన్న సభ్యులు యాక్టివ్‌గా ఉండేలా చూడాలన్నారు. ప్యాక్స్ రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. జిల్లాలో సరిగా పనిచేసే, చేయని ప్యాక్స్ వివరాలు సేకరించాలని ఆదేశించారు. రైతులకు నూతన సాగు విధానాలు, ఫిష్ ఫార్మింగ్, ఫిష్ ఫాండ్స్ ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాల నిర్వహణ షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు.
రైతులకు ఆదాయ మార్గాలు ఎలా కల్గించాలనే అంశంపై ఫ్యాక్స్ పని చేయాలని తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రణాళికాబద్ధంగా ఫ్యాక్స్ పని చేయాలని సూచించారు. రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలని, పైలట్ ప్రాజెక్టు కింద 3 ఫ్యాక్స్ ద్వారా వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్‌కు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. జడ్పీ సీఈవో దీక్షా రైనా, నాబార్డు జీఎం సుజిత్‌కుమార్, జిల్లా కో ఆర్డినేటివ్ అధికారి గంగాధర్, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, పశుసంవర్ధకశాఖ ఏడీ శ్రీరమణి, డీసీసీబీ సీఈవో ఆదిత్య పాల్గొన్నారు.