మామిళ్లగూడెం, జనవరి 8 : జిల్లాలో రైతుల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్‌పామ్ సాగు, రైతుబీమా, ఎరువుల లభ్యత, క్రాప్బుకింగ్పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో రైతుబీమా కింద వచ్చిన ైక్లెయిమ్, ఎల్ఐసీకి సమర్పించిన క్లెయిమ్ చెల్లింపులు ఆలస్యానికి కారణాలు, వాటిని ఎలా సరిచేస్తారు వంటి అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రైతుబీమాలో 420 దరఖాస్తులు వస్తే వ్యవసాయశాఖ నుంచి 347 క్లెయిమ్ ఎల్ఐసీకి సమర్పించారని, మిగిలిన 36 పురోగతిలో ఉన్నాయన్నారు. మరో 73 రైతుబీమా దరఖాస్తులు ఎల్ఐసీకి సమర్పించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సకాలంలో క్లెయిమ్‌లు చేయాలన్నారు. జిల్లాలో రైతుబీమా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండరాదన్నారు.
జిల్లాలో ఆయిల్‌పామ్ పంట సాగు పెంచాలని ప్రతి క్లస్టర్ పరిధిలో కనీసం 25ఎకరాల ఆయిల్‌పామ్ సాగు అయ్యే విధంగా రైతులను ఒప్పించాలని తెలిపారు. జిల్లాలో క్రాప్ బుకింగ్, రైతుబీమా, అయిల్‌పామ్ సాగు పక్కాగా జరగాలన్నారు. ఈ సీజన్లో సన్నరకం వడ్లకు బోనస్ విజయవంతంగా అందించామన్నారు. పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, హర్టికల్చర్ అధికారి మధుసూదన్, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.