మామిళ్లగూడెం, సెప్టెంబర్ 13 : జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, మధుసూదన్‌నాయక్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడూతూ జిల్లాలో ఈ నెల 16వ తేదీ సోమవారం వినాయక నిమజ్జనాలు అధికంగా జరుగుతాయని, మంగళవారం కూడా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుందని దీనికోసం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిమజ్జన స్థలాల వద్ద క్రేన్లు, పడవలు, విద్యుత్‌దీపాలు, గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక వైద్యశిబిరాలను అందుబాటులో ఉంచాలన్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 16వ తేదీన వెయ్యికి పైన, 17వ తేదీన 800 విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ ప్రణాళికలతోపాటు నిమజ్జన ప్రదేశంలో అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్ద విక్రమ్‌సింగ్, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఆర్వో రాజేశ్వరి, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలను జిల్లాలో ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవం వేడుకల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ రోజున ఉదయం 10 గంటలకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తమ సందేశాన్ని అందజేస్తారని, అనంతరం స్టాల్స్ సందర్శన ఉంటుందని తెలిపారు.
అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలుకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే ఈ వేడుకలకు జిల్లా అధికారులు తప్పకుండా హాజరుకావాలన్నారు. ప్రతి జిల్లా అధికారి కార్యాలయంతోపాటు గ్రామ పంచాయతీ, మండల స్థాయి, మున్సిపాల్టీల్లో వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరదల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు, సేవలు చేసేందుకు అధికారులు చేసిన పనితీరు ప్రశంసనీయమన్నారు. ఎంతో ఓపికతో సహాయక చర్యలు చేపట్టారని, విలువైన సేవలు అందించారని అభినందించారు.