మామిళ్లగూడెం, ఫిబ్రవరి 10: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మజ, డీఆర్డీవో సన్యాసయ్యలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఉదయం వచ్చి అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. నగరంలోని పాకబండ బజార్‌కు చెందిన జి.ఝాన్సీ, నగరానికి చెందిన దివ్యాంగుడు వినయ్‌కుమార్, పుట్టకోటకు చెందిన సర్సమ్మ తదితరులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.
ప్రజావాణిలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు పాల్గొన్నారు. అలాగే విలాంగుల హక్కుల పోరాట సమితి వినతిపత్రం అందించి.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆటో స్టాండ్ ఒకే సంఘానికి కాకుండా వివిధ సంఘాలకు లేదా టెండర్ రూపంలో ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో స్త్రీ టీ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, పేద దివ్యాంగ మహిళలకు వాటిని కేటాయిస్తామని, ఆ వివరాలు అందించాలని సూచించారు. పురుషులకు ఇతర పథకాల ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.