ఖమ్మం, ఫిబ్రవరి 25: ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను మార్చి 31వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్, సుడా, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి పరిష్కరించాలని సూచించారు.
రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల వద్ద ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయని, మార్చి 31వ తేదీలోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, నీటివనరుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో లేకుండా క్లియర్గా ఉన్న భూముల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించాలన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూట్నీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఆయా శాఖల సిబ్బందికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూట్నీ కోసం ప్రతిరోజూ లక్ష్యాలను నిర్దేశించాలన్నారు.
నీటిపారుదల శాఖ పరిధిలో తనిఖీల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నీటివనరుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉండవద్దన్నారు. పట్టణంలో నాలాల ఆక్రమణ కాకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించాలని, లే అవుట్ క్రమబద్ధీకరణ సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్డు సరిగా ఉండేలా చూడాలన్నారు. కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో నర్సింహారావు, ఆర్ఐలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.