మామిళ్లగూడెం, జనవరి 30 : జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి బౌద్ధస్తూపం, పాలేరు చెరువు, ఖమ్మం ఖిల్లా, పులి గుండాల ప్రాజెక్టు, జమలాపురం, వెలుగుమట్ల అర్బన్ పార్కు వంటి పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికల గురించి, ఎకో టూరిజంపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తలపెట్టిన పనులు, స్థితిగతులపై జిల్లా అటవీశాఖ అధికారి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధితోపాటు ప్రత్యేకంగా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. వెలుగుమట్ల అర్బన్‌పార్కు వద్ద 40 ఫీట్ల రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ ఏరియా ఉండాలని, లోపల ఎటువంటి ప్లాస్టిక్ అనుమతించడానికి వీలులేదన్నారు. పార్కులో చిన్న పిల్లల ప్లే ఏరియా, బోటింగ్ ఏరియా అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. పార్కు లోపల రోడ్డు నిర్మాణం చేయాలని, పులిగొండలో క్యాంపు సైట్ క్రియేట్ చేసుకునే విధంగా పనులు పూర్తిచేసి ఎకో టూరిజం ట్రిప్ నిర్వహించాలన్నారు. పార్కుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఎకో టూరిజం బ్రాండింగ్ వచ్చేలా నూతన లోగో, ట్యాగ్‌లైన్ తయారు చేయాలన్నారు. జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అటవీపార్కు, కాటేజీ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
పాలేరు చెరువు వద్ద పిక్నిక్ స్పాట్ అభివృద్ధి చేయాలని, ఇక్కడ ప్రజలకు అధికంగా ఆదాయం వచ్చేలా జాతీయ రహదారి దగ్గర ప్రచార హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాలేర్ లేక్ వద్ద బోటింగ్, క్యాంటిన్, పిక్నిక్ స్పాట్, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, బర్డ్ వాచింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి పర్యాటక ప్రాంతంలో మరుగుదొడ్లు, పరిశుభ్రత పాటించాలని సూచించారు. సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఖిల్లా వద్ద రోప్‌వే నిర్మాణ పనులకు ప్రజలతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. రోప్ వేకు 500 మీటర్ల దూరంలో పార్కింగ్ ఏరియా గుర్తించాలని ఆదేశించారు.
ఖమ్మంఖిల్లా వద్ద పురావస్తుశాఖ సమన్వయంతో అవసరమైన మరమ్మతులు చేపట్టి పర్యాటకులను ఆకర్షించాలని, స్కూల్ విద్యార్థులు, జర్నలిస్టులు, జిల్లా అధికారులతో ఖిల్లా చరిత్ర వాక్ ప్లాన్ చేసుకోవాలని తెలిపారు. జాఫర్ బావి వద్ద మార్చి నెలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థవిక్రమ్ సింగ్, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో నర్సింహారావు, పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, ఇరిగేషన్, దేవాదాయ, అటవీ, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.