సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 4: సింగరేణి బొగ్గు గనుల కారణంగా వచ్చే దుమ్ము, దద్దరిల్లే బాంబుల మోతతో తాము శ్మశానవాటికలో జీవిస్తున్నట్లు ఉందని కిష్టారం గ్రామస్తులు.. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాగమయితో కలిసి సత్తుపల్లి మండలంలోని సింగరేణి ప్రభావిత గ్రామంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాలుష్యం, బాంబు పేలుళ్లతో దెబ్బతిన్న ఇళ్లను, వర్షాల కారణంగా కూలిపోయిన నివాసాలను పరిశీలించారు.
అనంతరం గ్రామంలోని పాఠశాలలో నిర్వాసితులతో సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలో తమ గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు కలెక్టర్కు చెబుతుండగానే విద్యుత్ నిలిచిపోయింది. అనంరతం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయల కల్పనకు తక్షణమే చర్యలు చేపడతామని హామీఇచ్చారు. గ్రామస్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
బ్లాస్టింగ్, వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల స్థానంలో తిరిగి ఇళ్లు నిర్మించేందుకు సింగరేణి జీఎం షాలెంరాజు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఆయన వద్ద కొన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన నిధులు విడుదల చేయించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్రూంలు, వంట గదులు, సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేయాలని సింగరేణి జీఎంను ఆదేశించారు.
కాగా, సింగరేణి ప్రభావిత ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్తులు, రైతులు కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు. అనంరతం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. కిష్టారం గ్రామానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆర్డీవో రాజేంద్రగౌడ్, తహసీల్దార్ యోగేశ్వరరావు, ఎంపీడీవో చిన్ననాగేశ్వరరావు, స్నేహ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు దయానంద్, సింగరేణి పీవో నరసింహారావు, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.