ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 12 : సీసీఐ మద్దతు ధర క్వింటా రూ.7,521 పలుకుతుండగా.. 9 శాతం తేమ కలిగిన పంటను రూ.6,900 చొప్పున కొనుగోలు చేయడం, అక్కడున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టించు కోకపోవడంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో గల పత్తి యార్డును కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీంతో కలిసి పత్తి యార్డు మొదటి గేట్ నుంచి ఈ బిడ్డింగ్ కార్యాలయం వరకు కలియ తిరుగుతూ రైతులు విక్రయానికి తెచ్చిన పంటను పరిశీలించారు.
చేతితో, తేమ శాతం నిర్ధారణ యంత్రంతో పత్తిని పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడారు. ఏ గ్రామం నుంచి పంట తీసుకొచ్చారు? ఎంత మొత్తం తెచ్చారు? ఈ రోజు ఆన్లైన్ బిడ్డింగ్‌లో ధర ఎంత పలికింది? తేమ శాతం నిర్ధారణ జరుగుతుందా? అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, డీఎంవోలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఉద్యోగాలు ఊడిపోతాయన్నారు. వారం క్రితం నుంచి పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
14లోపు తేమ శాతం కలిగిన పత్తికి వ్యాపారులు ఇష్టారీతిన ధర పెడుతున్నారని, తేమ నిర్ధారణ కాకుండా కొనుగోళ్లు ఎలా చేస్తున్నారని మండిపడ్డారు. సత్వరమే సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ మార్కెట్లో సైతం తేమ శాతం నిర్ధారణకు అనుగుణంగా ధరలు ఉండాలన్నారు. మార్కెట్లో బ్రోకర్లకు తావు లేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కాగా.. వ్యవసాయ మార్కెట్ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌కు.. పలువురు రైతులు సమస్యలపై మొరపెట్టుకున్నారు. సీజన్ ప్రారంభం నుంచి మంచి, చెడు పత్తి అనే తేడా లేకుండా వారి నోటికి ఎంత ధర వస్తే అంతకు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉన్నా.. కనీసం రూ.7 వేలకు కొన్న నాధుడే మార్కెట్లో లేడన్నారు. దయచేసి మీరు అప్పుడప్పుడు మార్కెట్‌ను సందర్శించాలని, మీరు ఉంటేనే మాకు మంచి ధర పెడుతారని రైతులు చెప్పుకొచ్చారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెడుతున్నారని వాపోయారు.