మామిళ్లగూడెం, మే 30 : వర్షాలు, వరదల వంటి విపత్తు సమయంలో ముందస్తు ప్రణాళికతో వెళితే ఆస్తి, ప్రాణనష్టం, విలువైన వస్తువులు కోల్పోకుండా చూడవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. విపత్తుల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఆపద మిత్రులకు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
గత ఏడాది ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ మొదటి తేదీ వరకు వచ్చిన వరదల వల్ల నగరం ఆపదలో చిక్కుకున్నదని, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అద్భుతంగా పని చేయడంతో అతి తక్కువ ప్రాణనష్టంతో బయటపడ్డామని, 15 రోజుల వ్యవధిలోనే సాధారణ స్థితికి తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతానికి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసే వర్షం వివరాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. వచ్చే బుధవారం మండల స్థాయిలో అపదమిత్రుల పరిచయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో ప్రమాద సమాచారం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 1077కు అందిన వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుతుందని తెలిపారు. 12 రోజుల్లో 300 మంది శిక్షణ పొందిన వలంటీర్లు ఆపద సమయంలో ప్రజలకు సేవలు అందిస్తారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం వలంటీర్లకు కలెక్టర్ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, సీపీవో శ్రీనివాస్, టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.