భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత లేదని, యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం లైన్లో నిలుచునే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు అవసరాలకు మించి యూరియా కొనుగోలు చేయవద్దని, కేవలం పంటలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
యూరియాకు బదులుగా నానో యూరియా ఉపయోగించుకోవాలని, దీనివల్ల ఖర్చు తగ్గుతుందన్నారు. యూరియా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఈ సీజన్లో వెయ్యి ఎకరాల మునగ సాగు లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. అజోల్లా పెంపకం, బయాచోర్ తయారీ వంటి పర్యావరణహిత చర్యలను రైతులకు పరిచయం చేయాలన్నారు. సమావేశంలో డీఏవో బాబూరావు, డీఎస్వో శ్రీనివాసరావు, ఆత్మ పీడీ సరిత, మార్కెఫెడ్ డీఎం సునీత, సొసైటీ సీఈవోలు, ఏడీఏలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.