కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 30 : అవయవ లోపం ఉందని కుంగిపోకుండా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం ఆనంద ఖని పాఠశాలలో సమగ్ర శిక్ష, ఆలింకో ఆధ్వర్యంలో 18 ఏళ్లలోపు దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ దివ్యాంగుడిలో ఏదో ప్రత్యేక సామర్థ్యం ఉంటుందని, దానిని గుర్తించి వారు భవిష్యత్‌లో మరింతగా ఎదిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. మూడు రోజులపాటు జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఉపకరణాలను పొందాలని సూచించారు.
జిల్లాలోని 17 మండలాల్లో దివ్యాంగులు విద్యను అభ్యసించేందుకు నూతన భవిత కేంద్రాలను నిర్మిస్తున్నామని, అలాగే పాత భవనాలకు మరమ్మతులు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఈవో నాగలక్ష్మి, జిల్లా సమ్మిళిత విద్యా కో ఆర్డినేటర్ సైదులు, ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీశ్‌కుమార్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజు శేఖర్, ఆలింకో డాక్టర్లు ప్రియా శర్మ, వికాస్, హెచ్ఎంలు మంగీలాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.