అశ్వారావుపేట, అక్టోబర్ 4:రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగుల కోసం ఓపీ షెడ్ నిర్మించాలని, చెట్ల కింద కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు.
ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు, ఇతర సమస్యలపై నివేదిక అందించాలని, పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే అందజేస్తే నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధుల కొరత లేదని అన్నారు. ‘సమస్యలను నా దృష్టికి తీసుకొస్తేనేగదా పరిష్కారల చర్యలు తీసుకునేది?’ అని అన్నారు. రోగుల సమస్యలు తమకు తెలియదనే మాట వైద్యులునీ, సిబ్బంది గానీ చెప్పే పరిస్థితి రాకూడదని అన్నారు.
మందుల కొరతను అస్సలు రానీయొద్దని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కొందరు రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది సమస్యలను కూడా నేరుగా అడిగి తెలుసుకున్నారు. కాగా, మండలంలోని ఇసుక అక్రమ రవాణాను నిరోధించి ర్యాంపుల నుంచి అనుమతులు మంజూరు చేయాలని టీడీపీ నాయకులు నార్లపాటి శ్రీను కలెక్టర్‌కు విన్నవించారు.
వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధిలో కీలకంగా ఉన్న వ్యవసాయ కళాశాలను భద్రాద్రి కలెక్టర్ జితేశ్ సందర్శించారు. కళాశాల అసోషియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్కుమార్తోపాటు బోధన సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా సహకరించాలని ఆదేశించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వృత్తిగా కాకుండా సొంత వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పుట్టగొడుగుల పెంపకం, పంటల సాగు, యాజమాన్య పద్ధతులను పరిశీలించారు. ప్రయోగాత్మక పంటల సాగు పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అసోషియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్, తహసీల్దార్ కృష్ణప్రసాద్, కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ రాంప్రసాద్, శిరీష, ఝాన్సీ, రెడ్డిప్రియ, శ్రీలత, శ్రావణ్‌కుమార్, కృష్ణతేజ, ఏవో జంబమ్మ పాల్గొన్నారు.