భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రజలందరూ భేదాభిప్రాయాలను విడిచిపెట్టి ఐక్యతాభావంతో మెలగాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గురువారం ఐడీవోసీ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతి ఐక్యతపై అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాస్య శృంఖలాల్లో చిక్కుకొని సంక్షోభంలో ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రం కావాలని భగత్‌సింగ్ నుంచి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి గొప్ప నాయకులు ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీవో సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఏవో రమాదేవి, జిల్లా వైద్యాధికారి భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.