చండ్రుగొండ/పాల్వంచ, జూన్ 20 : విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. గురువారం మద్దుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టిన పనులను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించడంతోపాటు విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వెళితే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థమవుతాయని, విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచిత విద్యతోపాటు పాఠ్య, నోట్ పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నదని చెప్పారు.
పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే మద్దుకూరుకు చెందిన ఉపాధిహామీ కూలీలు కలెక్టర్‌ను కలిసి ఫీల్డ్ అసిస్టెంట్‌పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాల్వంచలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వయంగా పిల్లలకు మాత్రలు వేశారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి వేల్పుల విజేత, దుర్గా, ఎన్.క్రాంతి, బి.నాగేశ్వరరావు, ఇన్చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుకృత, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ మధువరన్, డాక్టర్ బాలాజీ, సీహెచ్‌వో నాగభూషణం, డిప్యూటీ డెమో ఎండీ ఫయాజ్ మొహినుద్దీన్, చండ్రుగొండ తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్, పీఆర్ ఈఈ సత్యనారాయణ, ఎంఈవో సత్యనారాయణ, సీడీపీవో నిర్మలాజ్యోతి, ఏఈ శ్రీనివాస్, హెచ్ఎం భవాని పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ‘నులిపురుగులను నులిపేద్దాం-ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అనే నినాదాన్ని ఎత్తుకున్న వైద్యారోగ్య శాఖ జిల్లాలో గురువారం డీ వార్మింగ్ డే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. పాల్వంచ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిల్లలకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లక్ష్మీదేవిపల్లి మండలంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్ ఆరోగ్య కేంద్రంలో పిల్లకు మాత్రలు వేశారు. జిల్లావ్యాప్తంగా 3,36,136 మంది పిల్లలు ఉండగా.. తొలిరోజు 3,19,501 మందికి మాత్రలు వేయగా.. మొత్తం 95 శాతం ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 27న మాపప్ డే కార్యక్రమంలో మిగిలిన పిల్లలకు మాత్రలు వేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు పిల్లలకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని చేపట్టారు. చుంచుపల్లిలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు పిల్లలకు మాత్రలు వేశారు.