భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆటలను బహుమతుల కోసం కాకుండా ఇష్టంతో ఆడుదామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మనమందరమూ బాల్యంలో ఇలాగే ఆడేవాళ్లమని గుర్తుచేశారు. బాల్యంలో తనకు ఆటలపై అమితాసక్తి ఉండేదని వివరించారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో మొదటి రోజు ఆదివారం 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ నుంచి రామచంద్ర డిగ్రీ కాలేజీ వరకు యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్‌ను కలెక్టర్ జితేశ్ ప్రారంభించి మాట్లాడారు.
ప్రజలు, యువకులు, విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకే ఈ 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరుగులు పెట్టడం వల్ల యువతీ యువకులకు, ముఖ్యంగా వృద్ధులకు అత్యంత సహాయకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉదయం పూట నడక, రన్నింగ్ వంటివి ఎంతో అవసరమని అన్నారు. డీవైఎస్వో పరంధామరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వివిధ అసోసియేషన్ల సభ్యులు, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.