భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐడీవోసీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణపై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గురువారం నుంచి మొదటి విడత జరిగే 159 పంచాయతీలకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. అన్నారు. ఆయా పంచాయతీల పరిధిలో 47 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాలకు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది చేరుకున్నారని వివరించారు.
మారుమూల ప్రాంతాల్లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల కోడ్ మంగళవారం నుంచి అమలులోకి వచ్చినందున రాజకీయ నాయకులు ప్రసంగాలు చేయొద్దని, సభలు నిర్వహించొద్దని సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు మున్సిపల్ పరిధిలో ఎన్నికల కోడ్ వర్తించదని కలెక్టర్ తెలిపారు. బరిలో నిలిచిన అభ్యర్థులు పత్రికల్లో ప్రకటనలు ఇస్తే పంచాయతీ అధికారులకు అందుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీవో అనూష, ఇన్చార్జి డీపీవో దిలీప్, డీపీఆర్వో హజ్గర్, ఏవో రమణ తదితరులు పాల్గొన్నారు.