కొత్తగూడెం అర్బన్, జూన్ 22: కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో జరిగిన ‘సండే బ్రిక్స్ చాలెంజ్’ ఉద్యోగులతోపాటు సామాన్య ప్రజల్లో స్ఫూర్తి నింపిందని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ఈబీ బ్రిక్స్ రూపకర్త, బెంగళూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి సలహాలకు అనుగుణంగా 168 మంది ప్రజలు పాల్గొని ఏడు మిషన్ల ద్వారా 300కు పైగా సీఎస్ఈబీ బ్రిక్స్ తయారు చేశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టీషర్టు, టోపీలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దగ్గరలో ఉన్న వనరులను ఉపయోగించుకొని పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా ఈ ఇటుకలు తయారు చేసుకోవచ్చని అన్నారు. తయారీ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందని, ఈ ఇటుకలతో చేపట్టే నిర్మాణాలకు ప్లాస్టరింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదని వివరించారు. డీఈవో వెంకటేశ్వరచారి, జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు సైదులు, నాగరాజు శేఖర్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, డీఆర్డీఏ అధికారులు, మెప్మా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.