భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు శక్తినిచ్చే చట్టం అని పేర్కొన్నారు.
ఇది ప్రభుత్వ పారదర్శకతను పెంపొందించి.. అధికార యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని తీసుకొస్తుందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని కోరితే.. దానిని సకాలంలో అందించడం ద్వారా పరిపాలనలో విశ్వసనీయత మరింతగా మెరుగుపడుతుందన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, సీపీవో సంజీవరావు, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, డీఎంహెచ్వో జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.