భద్రాచలం, జనవరి 8 : ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించి భద్రాచలం పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఆయా సెక్టార్ల అధికారులకు అప్పగించిన బాధ్యతలన్నీ పూర్తి చేశారన్నారు.
వేలాదిగా తరలిరానుండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులతో సర్వం సిద్ధం చేశామని, ఏ సెక్టార్ ఉద్యోగులు అక్కడే విధులు నిర్వర్తించేలా బాధ్యతలు అప్పగించామన్నారు. వీఐపీ, వీవీఐపీలతోపాటు సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ముక్కోటి సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకంగా గోదావరి తీరాన రివర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఇది గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందన్నారు.
రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు రివర్ ఫెస్టివల్లో పాల్గొని గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. అనంతరం మిథిలా స్టేడియం వద్ద వైకుంఠ ద్వార దర్శనం పనులను పరిశీలించిన కలెక్టర్.. అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.