టేకులపల్లి, ఆగస్టు 5 : ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందుతాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రాధాన్యత గురించి వివరించారు. తర్వాత స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శానిటరీ న్యాప్కిన్స్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన ‘చేయి చేయి కలుపుదాం-గంజాయిని నిర్మూలిద్దాం’ అనే పోస్టర్లను ఆవిష్కరించారు.
పాతతండాకు చెందిన ధారవత్ హర్జ సాగు చేసిన మునగ తోటను సందర్శించిన కలెక్టర్.. మునగలో అంతర పంటగా పత్తి సాగు చేయడం బాగుందన్నారు. రైతులు మునగ సాగుపై దృష్టి సారిస్తే లాభాలు పొందవచ్చన్నారు. వర్షాకాలంలో వరద బయటకు వెళ్లకుండా నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే అందులోనే నీరు నిల్వ ఉంటుందని, దీనికి ఉపాధిహామీ పథకం ద్వారా రైతులకు సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యచందన, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీవో రవీందర్రావు, ఎంపీవో లక్ష్మీగణేశ్ గాంధీ, ఏపీవో శ్రీనివాస్, ఏపీఎం రవికుమార్, ఎంపీపీ బానోత్ మౌనిక, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, ఎంపీటీసీ బానోత్ సరోజిని, ఏవో అన్నపూర్ణ, ఎస్సై సురేశ్, ఆర్ఐ రత్తయ్య, ఈసీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు