భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : శిశు మరణాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ఇది నిరంతరం జరగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు.
జిల్లాలో ఈ ఏడాది నమోదైన ఏడు శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని వైద్య పరీక్షలు సక్రమంగా చేయించుకునేలా గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తరచూ గర్భిణుల ఇళ్లను సందర్శించాలన్నారు.
రక్తహీనత, నివారణకు పౌష్టికాహారం, అవసరమైన మందులు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన, గొత్తికోయ ప్రాంతాల్లో పిల్లల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిమోనియాపై అవగాహన కల్పించేందుకు వారికి అర్థమయ్యే విధంగా వీడియోలు రూపొందించాలని ఆదేశించారు. అనంతరం క్షయవ్యాధి నివారణ, అవగాహన కోసం రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో జయలక్ష్మి, డీడబ్ల్యూవో స్వర్ణలత లెనీనా, వైద్య నిపుణులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.