భద్రాచలం, డిసెంబరు 29: ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను తిలకించేందుకు భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులు బొజ్జిగుప్ప, నారాయణపేట ప్రాంతాలను కూడా సందర్శించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కోరారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించేలా అధికారులు తగిన విధంగా ప్రచారం చేయాలని సూచించారు.
అలాగే అక్కడికి వెళ్లేందుకు మార్గాలు కూడా భక్తులకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాచలంలో ఆదివారం సాయంత్రం పర్యటించిన ఆయన.. ముక్కోటి ఏర్పాట్లను, ఐటీడీఏ గిరిజన మ్యూజియం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముక్కోటికి వచ్చే భక్తుల కోసం జనవరి 5లోపు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసి ఉంచాలని సూచించారు.
గిరిజన పర్యాటక ప్రాంతాలైన బొజ్జిగుప్ప, నారాయణపేటతోపాటు భద్రాచలంలోని గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసే గుడారాల వద్దకు భక్తులు ఎక్కువగా వచ్చేలా తగిన ప్రచారం చేయాలని సూచించారు. అలాగే అటువైపు వెళ్లేందుకు మార్గాలను తెలిపేలా రూట్మ్యాపులు ఉంచాలన్నారు. అలాగే నది ఒడ్డున గుడారాలను ఆకర్షణీంగా ఏర్పాటు చేయాలని, అక్కడ మౌలిక వసతులు కల్పించాలని, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలకు స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్‌రావు, దేవస్థానం ఈఈ రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.