భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పోడు వ్యవసాయానికి విద్యుద్దీకరణ, ఉపాధిహామీ పనుల పురోగతి, తాగునీటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం, ఇంకుడుగుంతల తవ్వకాలు, మీ సేవా దరఖాస్తులు, ధరణి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు పట్టాలు పొందిన రైతులు వ్యవసాయం చేయడానికి విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యుత్ లైన్ల ఏర్పాటు సాధ్యంకాని ప్రదేశాల్లో అటవీశాఖ అధికారుల ఆమోదంతో బావులు తవ్వి సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పోడు భూముల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
బతుకమ్మ పండుగలో పూజకు ఉపయోగించే తంగేడు పూలు ఎక్కడా కనపడటం లేదని, ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నాటాలని సూచించారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, అడిషనల్ డీపీఆర్వో రవి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా, డీఈవో వెంకటేశ్వరాచారి పాల్గొన్నారు.