బూర్గంపహాడ్ (భద్రాచలం), ఆగస్టు 16 : గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన కళాకృతు లు, వాటి చరిత్ర పర్యాటకులకు తెలిసే విధంగా మ్యూజియంలో అమర్చాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియంను శుక్రవారం సందర్శించిన ఆయన మ్యూజియంలో పాతతరానికి సంబంధించిన కళాకృతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాముడు కొలువుదీరిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి ఇతర రాష్ర్టాల నుంచి భక్తులతోపాటు పాపికొండ అందాలను తిలకించడానికి పర్యాటకులు, భక్తులు ఎక్కువగా వస్తుంటారని, వారు తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియం సందర్శించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
మ్యూజియంను టూరిస్ట్ స్పాట్‌గా చేయాలంటే మరింతగా అభివృద్ధి చేయాలని, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో పాతతరం వంట పాత్రలు, నాగళ్లు, బుట్టలు, వారు ధరించే నగలన్నీ మ్యూజియంలో ఉండేలా ఏర్పాటు చేయాలని, వాటి విశిష్టత గురించి పర్యాటకులకు వివరించాలన్నారు. త్వరలోనే మ్యూజియంను టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నర్సింహారావు, ట్రైబల్ మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి, చలపతి, సిబ్బంది పాల్గొన్నారు.