ఖమ్మం, ఫిబ్రవరి 19: ఆయకట్టు చిట్ట చివరి భూముల వరకూ సాగునీరు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఇందుకోసం పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీరు అందించే అంశంపై నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వారి పరిధిలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏ సమస్య ఎదురైనా పరిషరించే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి పంటలు సాగు చేస్తారని, పంటకు నీరు రాకపోతే నష్టపోతారని అన్నారు.
అందుకని సైంటిఫిక్గా నీటిని కేటాయించాలని సూచించారు. సమస్యలు ఎకడెకడ తలెత్తుతాయో ముందుగా విశ్లేశించి అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత శాఖలు సంయుక్త బృందాలుగా ఏర్పడి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఈ బృందాలను గ్రామాల వారీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి విడుదలకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. ఏ గ్రామానికి, ఏ ప్రాంతానికి ఎప్పుడు నీరు విడుదలవుతుందనే విషయాన్ని రైతులకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్వో పద్మశ్రీ, ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, డీఏవో పుల్లయ్య, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.